చిత్తూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయపన్ను మినహాయింపు (డిడక్షన్) వివరాలన్నీ ఈనెల 15లోగా సిస్టంలో ఉంచాలని డ్రాయింగ్ డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్స్ (డీడీవో)లను ఖజానాశాఖ ఆదేశించింది. ఈ మేర ఖజానాశాఖ డీడీ రామచంద్ర డీడీవోలకు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను గతంలో ఫిబ్రవరి నెలలో వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించినట్లు డీడీవోలు డిక్లరేషన్ ఇచ్చేవారని తెలిపారు. అయితే ఈ ఏడాది నుంచి ఉద్యోగులు ఆదాయ పన్ను స్లాబ్‌ల వారీగా వారికి వచ్చే జీతం, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ (వికలాంగులకు), గ్రాస్, జీతం, మెడికల్, హౌస్ వంటి రికవరి వివరాలను సరైన ఆధారాలతో సిస్టమ్‌లో డీడీవోలు అందజేయాలని ఆయన జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలవారీగా ఆదాయపన్ను చెల్లింపులు చేయగా, మార్చినెల లోగా మినహాయింపులు పోగా చెల్లించాల్సిన మిగులు చెల్లింపులను ఫిబ్రవరిలోగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యోగి చెల్లించాల్సిన ఆదాయపన్ను వివరాలను ఇవ్వని యెడల అట్టి ఉద్యోగి వివరాలను డీడీవోలే లెక్కింపులు చేసి అందించాలని చెప్పారు.