సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3 లక్షలకు ఎల్వోసీ మంజూరు క్యాన్సర్ చికిత్సకు సాయం చేయాలంటూ ఓ బాధితుడి కుటుంబం పెట్టిన ట్వీట్ కు మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.3 లక్షలకు ఎల్వోసీ మంజూరు చేశారు. బాధితుడి కుటుంబంతో తన టీమ్ మాట్లాడి వివరాలు సేకరించిందని చెప్పారు. దీంతో క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం తరఫున భరించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.గుంటూరు జిల్లా ధర్మకోటకు చెందిన గార్లపాటి బ్రహ్మయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆయన క్యాన్సర్ బారిన పడినట్లు తేలింది. చికిత్సకు సుమారు రూ.5 లక్షల వరకు అవుతుందని వైద్యులు తెలిపారు. బ్రహ్మయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఆయన కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేశ్ ను సాయం కోరారు. ట్విట్టర్ లో వివరాలు పోస్టు చేస్తూ ఆదుకోవాలంటూ మంత్రి నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి.. తన టీమ్ ఫోన్ చేస్తుందని చెప్పారు. బాధితుడి వివరాలు తెలుసుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్వోసీ జారీ చేశారు. కాగా, అడిగిన వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేశ్ కు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.