ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్రమోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేసి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు.
అభివృద్ధి, సంక్షేమానికి అందలం ఎక్కించి, అవినీతి, అబద్ధాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పారని అన్నారు. కాంగ్రెస్ సమాధిపై ఢిల్లీ ప్రజలు మరో రాయిని పేర్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీకి పట్టం కట్టి దేశ రాజధానిని ఒక వికసిత్ ఢిల్లీగా తీర్చిదిద్దడానికి బాటలు వేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈసారి బీజేపీని ఆదరించిన దక్షిణాది రాష్ట్రాల ప్రజలకూ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. గెలుపొందిన వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.