ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి పార్టీల నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వం పైన విమర్శల తీవ్రత పెంచారు.వైఎస్సార్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు వైసీపీ బాట పడుతున్నారు. తాజా గా మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు చర్చలు పూర్తయినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మరి కొందరు సీనియర్లు సైతం వైసీపీలోకి రానున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం పైన విమర్శలను ఎక్కు పెట్టారు. ఇటు పార్టీ కార్యకర్తల కోసం తాను గతం కంటే భిన్నంగా పని చేస్తానని హామీ ఇస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. ఇటు వైసీపీలో ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ఈ సమయంలోనే గత అనుభవాలు.. ఓటమితో జగన్ వ్యూహం మార్చారు. నాడు వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా చర్చలు సాగుతున్నాయి.
అందులో భాగంగానే ముందుగా మాజీ మంత్రి శైలజానాధ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి వైసీపీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విభజన బిల్లు వ్యతిరేకించటంతో నాడు కాంగ్రెస్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ.. విభజన సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. జగన్ సీఎం అయిన సమయం లో పూర్తి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత జగన్ పైన విమర్శలు చేసారు. తాజాగా జగన్ ఓడిన తరువాత పరిమితంగానే స్పందిస్తున్నారు. పోలవరం పైన ఉండవల్లి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు.
ఉండవల్లి వస్తున్నారంటూ
బీజేపీకి తొలి నుంచి వ్యతిరేకిగా ముద్ర పడిన ఉండవల్లి.. ప్రస్తుతం వైసీపీలోకి రావాలంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైఎస్ సన్నిహితుడుగా పేరున్న ఉండవల్లి రాకతో పార్టీకి మంచి వాయిస్ ఉంటుందని భావిస్తున్నారు. ఉండవల్లి ఈ నెల 26 తరువాత వైసీపీలో చేరుతారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. కానీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి నిజంగా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారా లేదా అనేది ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక, కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్న తూర్పు గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరటం ఖాయమైందని సమాచారం. దశల వారీగా పార్టీలో సీనియర్ల చేరికలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరికల అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
![]() |
![]() |