ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ నిలబెట్టుకోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సంక్షేమం, తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టాలని కేజ్రీవాల్ చూశారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో వెహికల్ పొల్యూషన్‌తోపాటు పొలిటికల్ పొల్యూషన్ ఉందని, బీజేపీ గెలుపుతో ఆ రెండూ పోతాయని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారని పెమ్మసాని చెప్పుకొచ్చారు.
ఆ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్‌ని గెలిపించాలని సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రజలకు మంచి నీరు, సరైన రోడ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఆయన మంచి చేస్తారని రెండు సార్లు గెలిపిస్తే అవినీతి ఆరోపణలు ఎదురుకొన్నారని ధ్వజమెత్తారు. నీతి నిజాయతీతో రాజకీయం చేస్తానని గెలిచిన కేజ్రీవాల్ ఆ విధంగా చేయలేకపోయారు కాబట్టే ప్రజలు అతన్ని ఓడించారని చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలను ప్రజలు విశ్వసించడం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పుకొచ్చారు.