పర్యాటకాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాలు, నగరాలకు సమీపాన ఉన్న అటవీ ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి కోసంగిపురం జంక్షన్ సమీపంలో 125 ఎకరాల్లో ‘మెండు నగర వనం’ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. జాతీయ రహదారి చెంతనే ఈ ప్రాంతంలో 650 ఎకరాల విస్తీర్ణంలో మెండు ఫారెస్టు ఏరియా విస్తరించి ఉంది. పలాస, మందస, మెళియాపుట్టి మండలాల వరకూ అంతటా అటవీ ప్రాంతమే.
అరుదైన జంతువులు, పక్షులు, ఇతర మూగజీవాలు ఇక్కడ నివసిస్తుంటాయి. జీడి చెట్లు అధికంగా ఉన్నాయి. ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నగర వనం నిర్మించేందుకు ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు మంజూరు చేసింది. అడవుల సంరక్షణ, వర్షపునీటి పరిరక్షణ ధ్యేయంగా ఈ నగరవనాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ అటవీ శాఖ కార్యకలాపాల ద్వారా మెండు అటవీ ప్రాంతాన్ని రక్షించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మరోవైపు అటవీ ఉత్పత్తుల క్రయ విక్రయాలు కూడా ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్స్ పార్కు, అడ్వంచర్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ట్రేకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, స్విమ్మింగ్ ఫూల్స్, ట్యాంకులు సైతం నిర్మిస్తున్నారు. అన్ని వంటకాలను అందించే రెస్టారెంట్, యోగా సెంటర్, పర్ణశాల ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా భారీ జంతువుల బొమ్మలు సిద్ధం చేస్తున్నారు. అటవీ శాఖ పర్యవేక్షణ ఉండేలా అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు.
![]() |
![]() |