వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు కేటాయించకుండా అప్పటి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దారి మళ్లించిందని ఆయన మండిపడ్డారు. గ్రామస్థాయి సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించుకోవడం స్థానిక స్వయం పరిపాలనకు నిదర్శమని పవన్ చెప్పుకొచ్చారు. కానీ గత ఐదేళ్ల కాలంలో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయడం ద్వారా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. దీని వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని పవన్ ఆగ్రహించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు.
అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా విస్సా కోడేరు గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన రూ.10 లక్షలతో తాగునీటి సమస్యకు గ్రామ పంచాయతీనే పరిష్కారం చూపిందని పవన్ తెలిపారు. ఆర్థిక సంఘం నిధులతో రెండు ఫిల్టర్ బెడ్లు, నిరుపయోగంగా ఉన్న నీటిశుద్ధి కేంద్రాన్ని గ్రామస్థులే మరమ్మతు చేసుకున్నారని, అలాగే నూతన పైప్ లైన్లు వేయడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కారం చూపుకున్నారని ప్రశంసించారు. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు పంచాయతీని, గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పవన్ చెప్పారు. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీ రాజ్, నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు చెబుతున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలియజేశారు.
![]() |
![]() |