ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌కు వంగవీటి మోహన రంగా పేరును పెట్టాలంటూ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రజలకు వంగవీటి మోహన రంగా చేసిన సేవలకు గుర్తుగా విజయవాడ పశ్చిమ బైపాస్‌కు ఆయన పేరు పెట్టాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షర్మిల విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు రంగా పేరు పెట్టాలని తాము కోరుతున్నామని.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబును కోరుతూ వైఎస్ షర్మిల సోమవారం లేఖ రాశారు.
ఇక ఈ లేఖలో విజయవాడ ప్రజలకు వంగవీటి రంగా చేసిన సేవలను వైఎస్ షర్మిల కొనియాడారు. వంగవీటి రంగా చేసిన విజయవాడ ప్రజలకు చేసిన సేవలు అనిర్వచనీయమని.. సామాజిక న్యాయంపై దృష్టి సారించి, అణగారిన వర్గాల తరుఫున ఆయన నిలబడ్డారని కొనియాడారు. భూమి లేని ప్రజలకు భూపంపిణీ చేపట్టి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని షర్మిల పేర్కొన్నారు. వంగవీటి రంగా సేవలకు గుర్తుగా విజయవాడ వెస్ట్ బైపాస్కు ఆయన పేరు పెట్టాలని.. ఆ విధంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని వైఎస్ షర్మిల.. చంద్రబాబును కోరారు.
మరోవైపు గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ నుంచి చిన్న అవుటుపల్లి వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని నిర్మిస్తోంది. 47.8 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా ఈ రహదారి నిర్మాణం జరుగుతుండగా.. మరికొన్ని రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి అయితే విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది. పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ రహదారికి వంగవీటి రంగా పేరు పెట్టాలని వైఎస్ షర్మిల కోరుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం.. షర్మిల ప్రతిపాదనకు అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి మరి.
![]() |
![]() |