ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాలను దక్కించుకుని.. అధికారాన్ని చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి ఎంపికే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాషాయ పార్టీ సంప్రదాయం కాదు. గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యేలు, హైకమాండ్ కలిసి.. ముఖ్యమంత్రి సీటులో ఎవరిని కూర్చోబెట్టాలి అనేది నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 2 రోజులు గడిచినా.. ఇంకా సీఎం ఎంపికపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండగా.. ఈనెల 13వ తేదీ తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలనుంది.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పర్వేష్ వర్మ. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసి మట్టికరిపించిన పర్వేష్ వర్మ.. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు కావడం గమనార్హం. కేజ్రీవాల్‌ని ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందు ఉన్నారనే వార్తలు కాషాయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండొచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు.. తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిగా ఒక మహిళా ఎమ్మెల్యేని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. అంతేకాకుండా ఢిల్లీలోని బలహీన వర్గాల నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు వివరించాయి. ఢిల్లీ మంత్రివర్గంలో మహిళలు, దళితులకు బలమైన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపాయి.
ఇక ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలంటే.. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు ఉన్నారు. వారే రేఖా గుప్తా, శిఖా రాయ్, పూనమ్ శర్మ, నీలం పెహల్వాడ్. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత బందన కుమారిని 29,595 ఓట్లతో ఓడించారు. మరోవైపు.. గ్రేటర్ కైలాష్ స్థానం నుంచి బరిలోకి దిగిన శిఖా రాయ్.. ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను 3188 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఇక వజీర్ పూర్ సీటు నుంచి పోటీలో ఉన్న పూనమ్ శర్మ.. ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తాకు పరాజయం రుచిచూపించారు. చివరిగా నాజాఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నీలం పెహల్వాన్.. ఆప్ నేత తరుణ్ కుమార్‌పై 29 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వీరిలో ఒకరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని.. బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.