ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జన్ సురాజ్ పార్టీ అధినేత, పోల్ స్ట్రాటజిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు చెప్పారు. అదే సమయంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పరాజయం వెనుక ఉన్న కారణం కూడా వెల్లడించారు. గతేడాది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం.. ఆప్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. బెయిల్ వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఆయన చేసిన అతి పెద్ద తప్పు అని వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి మొదటి కారణం గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకతనే అని చెప్పారు. ఇక రెండో కారణం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయినపుడు ఆయన పదవి నుంచి తప్పుకుని ఉండాల్సిందని చెప్పారు. అయితే బెయిల్ పొందిన తర్వాత రాజీనామా చేయడం.. ఎన్నికలకు ముందు ఆతిశీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అయ్యిందని వెల్లడించారు.
అంతేకాకుండా ఇటీవలి కాలంలో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వైఖరి కూడా మారిందని.. దేశంలో ప్రతిపక్ష కూటమిగా ఉన్న ఇండియాపై ఆయన నిర్ణయాలు కూడా ఆప్‌ను కొంత వరకు దెబ్బతీశాయని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో కాకుండా ఒంటరిగా పోటీ చేయడంతో అది ఆప్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. కేజ్రీవాల్ పరిపాలనలోని లోపాలను ఢిల్లీ ప్రజలు ఎత్తి చూపినా ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఢిల్లీలో ఇక ఆప్ తన రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమేనని చెప్పారు. ఇక చాలా కష్టపడితే కానీ.. అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 12 ఏళ్ల ఆప్ పాలన అనంతరం.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ పార్టీ జెండా ఎగిరింది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 48 సీట్లు దక్కగా ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమై అధికారాన్ని పోగొట్టుకుంది. ఇక ఒక్క స్థానంలో గెలవకుండా వరుసగా మూడోసారి కాంగ్రెస్ పార్టీ సున్నాకే పరిమితం అయింది.
![]() |
![]() |