పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాలా తయారై... ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు.గతంలో తన అక్రమ సంపాదనతో జగన్ ను పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా పెద్దిరెడ్డి అనేకసార్లు ప్రయత్నించారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని... గనులు, ఖనిజం, ఇసుక, ప్రభుత్వ స్థలాలు, పేదల, అటవీ భూములు, ఎర్రచందనం, యధేచ్ఛగా దోచుకున్నారని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి నోరు మూయించేవారని తెలిపారు. అధికారులు కూడా వీరి చేష్టలు చూసీ చూడనట్లు ఉండాల్సిందేనని, ఎదురుతిరిగితే తిప్పలు తప్పవని వివరించారు. పెద్దిరెడ్డి 238 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించాడంటే... అటవీ చట్టం ఇతనికి ఎన్ని జీవిత శిక్షలు వేయొచ్చో చెప్పాలి. గనుల శాఖలో 400 మందికి ప్రైవేటుగా ఉద్యోగాలిచ్చాడంటే ఈ పెద్దిరెడ్డి ఎంతటి ఘనాపాటో అర్థం చేసుకోవచ్చు. పెద్దిరెడ్డి ప్రెస్ లో తాను తప్పు చేయలేదని ఎప్పుడూ చెప్పలేదుగానీ... నన్నెవరూ ఏమీ చేయలేరని మాత్రం పదే పదే చెప్పేవాడు. పెద్దిరెడ్డి పాపాల్లో జగన్ కు భాగముండబట్టే ఇతని అవినీతి సామ్రాజ్యాన్ని జగన్ ఏనాడూ ప్రశ్నించలేదు. చంద్రబాబు పుంగనూరు వెళతానంటే.. నా పుంగనూరులో అడుగుపెట్టడానికి వీల్లేదని నిరోధించిన అరాచకవాది ఈ పెద్దిరెడ్డి. గనులేమో పెద్దిరెడ్డి, అటవీశాఖ పెద్దిరెడ్డి శ్రీమతికి, మద్యం అవినాష్ రెడ్డికి, ఎర్రచందనం పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డికి... ఇలా పంచుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. అనేక ఎకరాల అటవీ భూములను కొల్లగొడుతుంటే అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. అటవీశాఖ అధికారులు ఇప్పుడైనా రంగంలోకి దిగాలి. విజిలెన్స్ రిపోర్టును బేస్ చేసుకొని రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేం డిమాండ్ చేస్తున్నాం. రాక్షస సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డిపై వెంటనే ఫారెస్టు యాక్టు కింద కేసు రిజిష్టర్ చేయాలి. పెద్దిరెడ్డి కుంటుంబం విదేశాలకు పారిపోయే అవకాశముంది, కావున ఆ నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకోవాలి. ఫారెస్టు యాక్టుల నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు, నాన్ బెయిలబుల్ యాక్టులున్నాయి. ఈ దుర్మార్గులకు ఆ సెక్షన్లు ఆపాదించాలి. పెద్దిరెడ్డి వెయ్యి తప్పులు పూర్తయ్యాయి... కావున దండన తప్పదు. పెద్దిరెడ్డిపై ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. పెద్దిరెడ్డి పనైపోయింది, ఇక కోరలు పీకిన పాములాంటివాడు. పుంగనూరు ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు, ఫారెస్టు శాఖల అధికారులు పెద్దిరెడ్డి తప్పులను వెలికితీయడంలో నిమగ్నమవ్వాలి. వారిని అరెస్టు చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపాలి. ఇక్కడ ప్రెస్ లో మాట్లాడుతుంటే, పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు ఇవ్వడానికి పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ముందు పెద్దిరెడ్డి బాధితులు క్యూ కట్టారు. పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిపై వెంటనే ఈడి, ఐటీ శాఖాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టాలి. పెద్దిరెడ్డి కుటుంబం తమ విలాసాలకు కట్టుకున్న భవంతులపై కూడా విచారణ జరపాలి. తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. పెద్దిరెడ్డి పదేళ్ల క్రితం స్కూటర్ పై తిరిగేవాడని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చెప్పాడు. ఆర్థికంగా ఇంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారో ప్రజలకు తెలియజేయాలి. అటవీ భూములను కొల్లగొట్టి ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వీరికి శిక్ష పడాలి" అని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.
![]() |
![]() |