ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఆత్మల పేరుతో బురిడీ కొట్టించి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారాన్ని మధురై ముఠా కాజేసింది. వివరాల్లోకి వెళ్ళితే.... ఒంగోలులో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబ పెద్ద అనారోగ్యం పాలయ్యాడు. ఎక్కడ వైద్యం చేయించినా తగ్గకపోవడంతో మధురైలో ఉన్న మరో పురోహితుడిని ఆ పెద్దాయన కుమారుడు ఆశ్రయించాడు. దీంతో గతేడాది నవంబరులో రాత్రి 11 గంటలకు మధురై నుంచి ఎనిమిది మంది సభ్యుల ముఠా ఒంగోలు చేరుకుంది. బాధితుడి ఇల్లంతా కలియ తిరిగి ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయని యజమానితోపాటు కుటుంబసభ్యులను ఆ ముఠా సభ్యులు భయపెట్టారు.
కొన్ని పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. పూజ తర్వాత ఇంట్లో కాసు బంగారం కూడా ఉండటానికి వీల్లేదు, ఉంటే మరలా ఆత్మలు ప్రవేశిస్తాయని నమ్మించారు. ఈ మొత్తం బంగారాన్ని ఇంట్లో తిరుగుతున్న ఆత్మలతో కలిపి తగులబెడతామని చెప్పారు. మంగళసూత్రంతో సహా ఇవ్వాల్సిందేనని గట్టిగా చెప్పారు. అంతేకాకుండా ఆ పెద్దాయన సొంత గ్రామం ఒంగోలు సమీపంలో ఉండటంతో అక్కడకు వెళ్లి శ్మశానంలో తవ్వి ఎముకలు తీశారు. అక్కడ ఎముకలు, బంగారం, ఆత్మలను కలిపి తగులబెడుతున్నట్లు చెప్పి మంటలు వేశారు. అనంతరం ఆ యజమానికి సంబంధించిన ఇన్నోవా కారు వేసుకొని దర్జాగా వెళ్లారు. కారును ఎంతకీ వెనక్కి పంపకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. కొద్దిరోజుల అనంతరం జనవరి 25న ఆ ఇంటి పెద్ద కుమారుడు ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వారు మధురై వెళ్లి ముఠాలోని కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
![]() |
![]() |