ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అని వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నంచారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. సోమవారం వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగు చేసిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పండుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్క సమీక్ష చేసే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేకపోవడం శోచనీయమని తెలిపారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుని అధికారంలోకి వచ్చాక మాటలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం గత ప్రభుత్వం, వైయస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్ల పంపిణీ మాత్రమే చేస్తున్నారన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం 1.50 లక్షల పింఛన్లకు కోత పెట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 9 నెలలు కూడా కాకుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. అప్పులు సృష్టిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
![]() |
![]() |