ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మద్యం ధరల పెంపుపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వం మద్యం ధరలు పెంచి దోచుకుంటోందంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే టీడీపీ కూటమి సర్కారు ఈ ఆరోపణలు తిప్పికొడుతోంది. బాటిల్ మీద రూ. 10 మాత్రమే పెంచినట్లు క్లారిటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే దానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. అలా వైసీపీ హయాంలో తెచ్చిన అప్పుల్లో రూ.12వేల కోట్లు చెల్లించామని వివరించారు. మరో రూ.13వేల కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. వైసీపీ పాలనలో మద్యంలో అక్రమాలు జరిగాయన్న మంత్రి.. అన్ని తప్పులనూ సరిదిద్దుతున్నట్లు తెలిపారు.
మరోవైపు ఏపీలో ఎన్ని కొత్త మద్యం బ్రాండ్లు ఉన్నాయనే వివరాలను ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నట్లు మంత్రి వివరించారు. మద్యం నాణ్యతలో రాజీపడబోమన్న కొల్లు రవీంద్ర.. అన్ని తనిఖీలు చేసిన తర్వాతనే మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏఈఆర్‌టీ ద్వారా బాటిల్ మీద పది రూపాయలు పెంచామన్న మంత్రి రవీంద్ర.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్ల నుంచి రూ.150కోట్ల వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేశారు. రిటైలర్లకూ మార్జిన్ పెరుగుతుందని వివరించారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం తాజాగా మద్యం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్టర్ 99 రూపాయలకు విక్రయిస్తున్న బ్రాండ్లు మినహా మిగతా అన్ని లిక్కర్ బ్రాండ్ల రేట్లు పెంచింది. దీంతో క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్ల మీద ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీకి అదనంగా పది రూపాయలు చొప్పున ధర పెరగనుంది. బీర్ల ధరలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే మద్యం షాపుల లైసెన్సుదారులకు రిటైలర్ మార్జిన్‌ను ఇష్యూ ప్రైస్ మీద 14 శాతం చెల్లించేలా సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రకంగా బాటిల్ మీద పది రూపాయల పెంపు ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా.
![]() |
![]() |