రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో విద్యా రంగం నానాటికీ భ్రష్టుపట్టి పోతోందని, ముఖ్యంగా బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను నీరు గార్చిన ప్రభుత్వం, పిల్లలకు పురుగుల అన్నం పెడుతోందని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. ఆ భోజనం చేయలేక విద్యార్థులు అల్లాడి పోతున్నారని, సగం మంది పిల్లలు అనివార్యంగా ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకుంటున్నారని ఆయన వెల్లడించారు. గోరుముద్ద పథకం పేరు మార్చి, డొక్కా సీతమ్మ పేరు పెట్టిన ప్రభుత్వం, నాణ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. షాడో సీఎంగా వ్యవహరిస్తూ అన్ని శాఖల్లో కలగజేసుకునే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. తాను నిర్వహించే విద్యాశాఖను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.