తనకు పార్టీ మారే ఆలోచన లేదని వైయస్ఆర్‌సీపీ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన ఖండించారు. ఈ మేరకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదన్నారు. తాను పార్టీకి దూరంగా ఉన్నానని ఇటీవల మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో నిజం లేదన్నారు. పార్టీకి ద్రోహం చేసే ఆలోచన లేదని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంటే తమకు అభిమానమని, ఆ అభిమానంతోనే వైయస్ఆర్ తనయుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్నానని చెప్పారు. తాను ఎప్పటికీ వైయస్ఆర్‌సీపీలోనే ఉంటానని, వైయస్ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్లే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, ఇకపై తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వెల్లడించారు.