ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసకు చెందిన 10 ఏళ్ల బాలుడు యువంత్ కు అరుదైన వ్యాధి (గిలియన్ బ్యారీ సిండ్రోమ్) కారణంగా బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో బాలుడి తల్లిదండ్రులు అతని అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. దాంతో యువంత్ రెండు కళ్లు, రెండు కిడ్నీలు, లివర్ ను సేకరించిన డాక్టర్లు అవసరం ఉన్న కొందరికి వాటిని అమర్చారు. ఈ విధంగా మరణిస్తూ మరికొందరికి జీవితాన్ని ప్రసాదించిన యువంత్ మరణంపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. బాలుడి ఫ్యామిలీకి అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. యువంత్ ఫొటోను షేర్ చేసిన చంద్రబాబు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల యువంత్ అకాల మరణం బాధాకరమని పేర్కొన్నారు.అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు పుట్టినరోజే బ్రెయిన్ డెడ్‌కు గురైతే ఆ బాధ వర్ణనాతీతమని అన్నారు. అయినా పుట్టెడు దు:ఖంలో ఉండి కూడా కొడుకు అవయవదానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రుల సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం, మనోనిబ్బరం ఆదర్శనీయమని ప్రశంసించారు. ఆ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
![]() |
![]() |