కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..... తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ లక్ష్మి అనే మహిళ కన్నీటితో విలపిస్తుంటే కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లక్ష్మి నుంచి తీసుకున్న డబ్బుతోనే జనసేన సభలను కిరణ్ రాయల్ నిర్వహించడం వల్లే జనసేన నాయకత్వం ఈ విషయంలో అతడికి అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు.
ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న వారు ఎక్కడున్నారని నిలదీశారు. జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మూడు రోజుల ముందే లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ జోస్యం చెప్పడం, బాధితురాలు మీడియా ముందుకు వచ్చిన వెంటనే జైపూర్ పోలీసులు హటాత్తుగా ఊడిపడి ఆమెను అరెస్ట్ చేయడం చూస్తే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారనే విషయం అర్థమవుతోంది. అంటే కూటమి నేతలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా లక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించడానికే ఇదంతా చేశారు. మహిళలకు అన్నగా నిలబడతాను అంటూ బీరాలు పలికిన వారికి ఈరోజు తిరుపతిలో లక్ష్మి కారుస్తున్న కన్నీరు కనిపించడం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయి. మహిళా హోం మినిస్టర్ అనిత ప్రచారానికి, ఆర్భాటాలకే తప్ప మహిళల రక్షణపై ఎటువంటి దృష్టి సారించలేదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన వచ్చినా ఆ రోజే వారికి ఆఖరి రోజు అంటూ చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ఆడవారికి అన్యాయం చేసిన వారు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు అని ఆవేదన చెందారు.