కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లైనా, ఏడాదైనా ఫైళ్లు క్లియర్ కాకపోవడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహించారు. బాధ్యత లేకుండా పనిచేస్తున్నారంటూ అధికారులపై తీవ్ర స్వరం వినిపించారు. ఈ - ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈవో దినేశ్ కుమార్ ప్రజంటేషన్ ఇచ్చారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియర్ అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈవో తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఫైళ్లు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని నిర్దేశించారు. ఆర్థికేతర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలనీ, ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలపైనా అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు. అటవీశాఖ ప్రగతిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమయంలో గాలి నాణ్యతపై చర్చ జరిగింది. ‘రాష్ట్రంలోని వివిధ నగరాల్లో గాలి నాణ్యత ఎలా ఉంది? దేశంలోని ఇతర నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది?.’ అని సీఎం ప్రశ్నించారు. అనంతరాము వద్ద సమాచారం లేకపోవడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.
![]() |
![]() |