మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర మద్యం విధానంపై లేనిపోని ప్రచారం చేస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళవారం ఆయన అమరావతి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..... వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలకు పాల్పడి పిచ్చి బ్రాండ్లతో జనం సొమ్మును దోచేశారన్నారు. 2019-2004 మధ్య కాలంలో రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఎంతలా దోచుకున్నారో, కల్తీ మద్యంతో ఎంత మంది ప్రాణాలను హరించారో ప్రజలంతా చూశారన్నారు. జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో ఇప్పటికీ రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నాటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుంటే, దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
మద్యం షాపుల కేటాయింపు నుంచి బ్రాండ్ల పునరుద్ధరణ వరకూ అత్యంత పారదర్శకంగా అమలు చేయడం చూసి జగన్ రెడ్డి అండ్ కో ఓర్వలేకపోతున్నారన్నారు. ఏకంగా 90వేల దరఖాస్తులు వచ్చాయని, రూ.1800 కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందన్నారు. తాజాగా సీఎం ఇచ్చిన హామీ మేరకు మార్జిన్ మొత్తాన్ని 14శాతానికి పెంచేందుకు నిర్ణయించడాన్ని కూడా వక్ర భాష్యాలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఒక్కో బాటిల్‌పై రూ.10 పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం అనే వార్తల్లో కూడా నిజం లేదన్నారు. మార్జిన్ పెంచినప్పటికీ బాటిల్‌కు రూ.10 పెంచినప్పటికీ ప్రభుత్వానికి ఏటా రూ.100 నుంచి 150 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.
వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉన్నా లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. 2019-24 మధ్య కాలంలో జేబులు నింపుకోవడం కోసం రూ.60 ఉండే క్వార్టర్ రూ.200కి అమ్మారని, ప్రపంచంలో ఏ మూలనా దొరకని బ్రాండ్లను ఏపీలో ప్రజల నెత్తిన రుద్దారని విమర్శించారు. పిచ్చి మద్యం బ్రాండ్లు తెచ్చి ప్రజల ప్రాణాలు తీసిన వారే ఇప్పుడు మద్యం విధానంపై మాట్లాడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని షాపుల్ని అధికారుల్ని డిస్టిలరీలను చెప్పుచేతల్లో పెట్టుకుని దోచుకున్నారన్నారు. ఆ మొత్తం దోపిడీపై విచారణ జరుగుతోందని, త్వరలోనే పూర్తి నివేదికలు వస్తాయని మంత్రి తెలిపారు. అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. బెల్టు షాపుల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉందన్నారు. త్వరలోనే నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
![]() |
![]() |