పోలీసుస్టేషన్లో సీసీటీవీల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన మాచవరం ఠాణా ఎస్‌హెచ్‌వోకు ఏడాదిపాటు ఇంక్రిమెంట్‌ను నిలిపివేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యలపై తాము సంతృప్తిగా లేమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో వాస్తవాలను నిర్ధారించేందుకు సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని తాము ఆదేశించిన ప్రతిసారీ ఫుటేజ్ మాయమవుతోందని పేర్కొంది.
ఎస్‌ఎంపీఎస్ కాలిపోయిన కారణంగా సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ చేయలేకున్నామని సౌత్రికా టెక్నాలజీస్ ఇచ్చిన రిపోర్టును జత చేస్తూ మాచవరం ఠాణా ఎస్‌హెచ్‌వో, జిల్లా ఎస్పీ అఫిడవిట్లు వేశారని, సంబంధిత రిపోర్టులో ముద్రించిన కంపెనీ సీలు, సంతకంలో వ్యత్యాసం ఉందని గుర్తు చేసింది. సౌత్రికా టెక్నాలజీస్ నివేదిక వాస్తవికతపై అనుమానం కలుగుతోందంది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ ఎన్.హరినాథ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.