భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే మోదీ ఈ లేఖను రాసినప్పటికీ.. ఆమె అంతరిక్షంలో ఉండడం వల్ల పంపించలేదు. కానీ తాజాగా ఈ లేఖను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు. అందులో ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌ను ఉద్దేశించి అనేక విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆమె భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత.. ఇండియాలో ఆమెను చూడాలని కోరుకుంటున్నట్లు మోదీ ఆ లేఖలో వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మార్చి 1వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ఈ లేఖ రాశారు. అందులో భారత ప్రజలందరి తరఫు నుంచి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వివరించారు. అలాగే తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఓ కార్యక్రమంలో.. ప్రముఖ వ్యోమగామి మైక్ మాసిమినోను కలిసినట్లు చెప్పారు. ఆయనతో మాట్లాడుతుండగా.. మీ పేరు ప్రస్తావనకు వచ్చిందని అన్నారు. అప్పడు తనతో పాటు భారత దేశ ప్రజలంతా మీ పని పట్ల ఎంత గర్వపడుతున్నామో చెప్పామని వెల్లడించారు. ఈ సంభాషణ తర్వాతే నేను మీకు ఉత్తరం రాయాలనుకున్నానని చెప్పుకొచ్చారు.
తాను అమెరికా పర్యటన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బైడెన్‌ను కలిశానని.. వారితో మీ శ్రేయస్సు గురించి చర్చించానని మోదీ లేఖలో పేర్కొన్నారు. 1.4 బిలియన్ల భారతీయులు ఎల్లప్పుడూ మీ విజయాల పట్ల గర్వంగా ఉన్నారని.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు మీ స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదలను మరోసారి ప్రదర్శించాయన్నారు. వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ.. మీరు మా హృదయాలకు చాలా దగ్గరకా ఉన్నారని చెప్పుకొచ్చారు. మీ ఆరోగ్యం, మిషన్‌లో విజయం కోసం భారత ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారు తెలిపారు.
అలాగే మీ తల్లి శ్రీమతి బోనీ పాండ్యా.. మీ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని మోదీ ఆ లేఖలో వెల్లడించారు. మీ తండ్రి దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు కూడా మీతో ఎప్పటికీ ఉంటాయని తాను నమ్ముతున్న వివరించారు. 2016లో అమెరికా సందర్శించినప్పుడు మీతో పాటు ఆయనను కలవడం నాకు చాలా బాగా గుర్తుందని అన్నారు. మీరు భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత.. మిమ్మల్ని భారత దేశంలో చూడటానికి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు.
నెలలకుపైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు మరికొద్ది గంటల్లోనే భూమి మీదకి తిరిగి రాబోతున్నాన్నారు. నాసా- స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టి మరీ వీరిని భూమికి తీసుకు వస్తుండగా.. అంతా ఆసక్తిగా వీరి రాకను లైవ్‌లో చూస్తున్నారు.
![]() |
![]() |