కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అలియాస్ విరాట్ కొండూరు ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి 14 కిలోల బంగారం తీసుకొస్తూ రెండు వారాల కిందట బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు చిక్కిన రన్యా రావు.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె .రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది.
డీజీపీ (పోలీస్ హౌసింగ్ బోర్డు) రామచంద్రరావును తప్పనిసరి సెలవుపై పంపింది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారించింది. ఈ మేరకు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఈ కేసుకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి బుధవారంలోగా సమర్పించాల్సి ఉండటంతో. విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో వారికి కీలక ఆధారం లభించింది. గోల్డ్ స్మగ్లింగ్ వెనుక సూత్రధారి తెలుగు నటుడు తరుణ్ రాజ్ ఉన్నట్టు గుర్తించారు.
2019 నుంచి తరుణ్, రన్యా రావు మధ్య సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఇరువురూ కలిసి పలుసార్లు దుబాయ్ వెళ్లినట్టు సమాచారం. దుబాయ్‌లో కస్టమ్స్ తనిఖీలకు పట్టుబడకుండా అమెరికా పార్ట్‌పోర్ట్ ఉపయోగించినట్టు డీఆర్ఐ గుర్తించింది. అలాగే, రన్యారావు సైతం ఈ పాస్‌పోర్ట్ సాయంతోనే బంగారం అక్రమంగా తరలించినట్టు దర్యాప్తులో గుర్తించారు.
బంగారం కొని, అమ్మడానికి దుబాయ్‌లో ఇద్దరూ కలిసి వీరా డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో సంస్థను 2023లో స్థాపించినట్టు తేలింది. ఇందులో ఇరువురికి చెరో 50 శాతం వాటాలు ఉన్నట్టు వెల్లడయ్యింది. రన్యా రావు ప్రాథమిక పెట్టుబడిదారు కాగా.. లావాదేవీలన్నీ తరుణ్ చూస్తున్నట్టు బట్టబయలైంది. దుబాయ్‌కు బంగారం దిగుమతి చేసుకుని.. స్థానిక మార్కెట్‌లో విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోబెంగళూరు పోలీసులు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. రన్యా రావు ఈ వెంచర్‌కు ఏకైక ఆర్థిక మద్దతుదారుగా ఉన్నారు, కంపెనీని స్థాపించడానికి ఆమె సుమారు రూ.8-10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇందులో తరుణ్ ఆపరేషనల్ భాగస్వామిగా కీలక పాత్ర పోషించారు. దుబాయ్‌లోని డీలర్లకు చెల్లింపులు విదేశీ కరెన్సీలో జరిగాయని DRI అధికారులు నిర్దారించారు. అయితే, దుబాయ్‌కు చెందిన ఒక డీలర్ డబ్బు తీసుకుని, హ్యాండ్ ఇవ్వడంతో వారికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, దీని ఫలితంగా రూ.1.7 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రన్యా ఈ మొత్తాన్ని భారత్ నుంచి దుబాయ్‌కు హవాలా మార్గం ద్వారా బదిలీ చేసినట్లు తేలింది. కాగా, తరుణ్ రాజ్ పరిచయం అనే సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించాడు.
![]() |
![]() |