ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెల నెలా రూ.2500 అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇవ్వగా.. ఆ హామీని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే మహిళా సమ్మాన్ యోజన కింద ఢిల్లీలోని మహిళలకు రూ.2500 ఖాతాల్లో వేస్తామని తెలిపారు. తాజాగా ఢిల్లీ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రూ.1 లక్ష కోట్లతో మొట్టమొదటి బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. మహిళా సమ్మాన్ యోజన కోసం ఈ 2025-26 బడ్జెట్‌లో మొత్తం రూ.5100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. తొలి బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా విద్యుత్, రోడ్లు, నీరు వంటి 10 రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపిన సీఎం రేఖా గుప్తా.. వాటికి సరిపడా నిధులను బడ్జెట్‌లో కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఇక ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైన బడ్జెట్‌గా సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో మెరుగైన రవాణా సౌకర్యం కోసం రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. మహిళల భద్రత కోసం.. నగరం అంతటా 50 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఢిల్లీలో యమునా నది, మురుగు నీటి శుద్ధి కోసం రూ.9 వేల కోట్లు కేటాయించారు. మరోవైపు.. ఢిల్లీలోని నీటి ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆరోగ్య రంగానికి రూ.6,874 కోట్లు కేటాయించారు.
![]() |
![]() |