ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ గతేడాది తన కుటుంబ ఆదాయ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వాధికారులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడం ఉక్రెయిన్‌లో తప్పనిసరి. ఈ నేపథ్యంలో 2024లో తాను తీసుకున్న వేతనం, తన కుటుంబ ఆస్తులు, ఆదాయం, ఖర్చులు వంటి వాటిని వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం డేటాను విడుదల చేసింది. జెలెన్‌స్కీ తాజా డిక్లరేషన్ ప్రకారం.. 2024లో ఆయన కుటుంబ ఆదాయం 15,286,193 హ్రైవ్నియాలు. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 3.15 కోట్లు. ఇందులో ప్రభుత్వ సేల్స్ బాండ్స్ నుంచి వచ్చిన 8,585,532 (రూ.1.77 కోట్లు) హ్రైవ్నియాలు ఉన్నాయి. మిగిలిన మొత్తం అధ్యక్షుడి వేతనం, బ్యాంకు వడ్డీ, ప్రైవేటు రియల్ ఎస్టేట్ అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన చెల్లింపులు ఉన్నట్టు ‘ది కీవ్ ఇండిపెండెంట్’ పేర్కొంది. అంతకుముందు ఏడాది జెలెన్‌స్కీ, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయం 316,700 డాలర్లు (రూ. 2.7 కోట్లు). అంటే 2023తో పోలిస్తే అధ్యక్షుడి కుటుంబ ఆదాయంలో పెరుగుదల కనిపించింది. అయితే, ఈ పెరుగుదల అద్దెల ద్వారా వచ్చిందేనని పత్రిక తెలిపింది. అయితే, అధ్యక్షుడి కుటుంబ ఆస్తులు, రియల్ ఎస్టేట్, వాహనాలలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. జెలెన్‌స్కీ బిలియనీర్ అని గతంలో సోషల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ‘ఫోర్బ్స్ మిడిల్ఈస్ట్’ మాత్రం.. జెలెన్‌స్కీ బిలియనీర్ కావడానికి చాలా దూరంలో ఉన్నారని తెలిపింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు ఆయన నికర ఆస్తి దాదాపు 20 మిలియన్ డాలర్లు మాత్రమేనని పేర్కొంది. మాజీ కళాకారుడైన జెలెన్‌స్కీ 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయన సంపద హెచ్చుతగ్గులకు లోనవుతోంది.
![]() |
![]() |