ఈసారి వానా కాలంలో వర్షాలు కుమ్మేయనున్నాయి. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ ఐఎండీ వెల్లడించింది. వరుసగా రెండో ఏడాది కూడా నైరుతి సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపింది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్ల వర్షపాతంతో పోలిస్తే ఈసారి 105 శాతం వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసినా దేశంలోని అన్ని ప్రాంతాలకు అది సమానంగా ఉండే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతేడాది 106 శాతం వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేయగా, అంతకుమించి 108 శాతం వర్షపాతం నమోదైంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే, కోర్ మాన్‌సూన్ ప్రాంతమైన మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. దక్షిణాదిలో తమిళనాడు, ఉత్తరాదిలో జమ్మూకశ్మీర్, తూర్పున బీహార్, ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది
![]() |
![]() |