ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీపీ హైపర్ టెన్షన్ తగ్గేందుకు డాక్టర్ చెప్పిన చిట్కాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 11:02 PM

అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే టెన్షన్. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన డ్రెస్ కాస్త లేట్ గా వచ్చినా టెన్షన్. ఫోన్ పే పేమెంట్ అవకపోయినా టెన్షన్. అలా ప్రతి దానికీ టెన్షన్ పడుతూనే ఉంటారు చాలా మంది. ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు రెండు మూడే కావచ్చు. కానీ..అంతకి మించి ఎన్నో ఉదాహరణలు ఉంటున్నాయి. ఈ తరం యువతీ యువకులు చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా తక్కువ వయసులోనే బీపీ, షుగర్ వస్తోంది. మరీ ముప్పై ఏళ్లకే షుగర్ వచ్చిన వాళ్లు కూడా చాలా మంది ఉంటున్నారు. అంత కన్నా ప్రమాదకరమైంది ఈ హైపర్ టెన్షన్.


చాలా మంది నిర్లక్ష్యం చేసే అనారోగ్య సమస్య ఇది. 40 ఏళ్ల లోపు వారిలో ఎక్కువ మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. వాళ్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో ఉంటున్నాయి. అందుకే తక్కువ వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నారు. లైఫ్ స్టైల్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటోంది. ఈ సమస్యపై గ్లెనీగల్స్ హాస్పిటల్ లో పని చేసే కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి పూర్తి స్థాయి వివరాలు అందించారు. అసలు యంగ్ అడల్ట్స్ లో హైపర్ టెన్షన్ రావడానికి కారణాలేంటి. ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి అన్నది చెప్పారు.


సైలెంట్ కిల్లర్


ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలతో పాటు ఇండియాలోని సర్వేలు చెబుతున్న విషయం ఒకటే. యువతీ యువకులలో హైపర్ టెన్షన్ సమస్య తీవ్రంగా ఉంది. భారత్ విషయానికొస్తే..18-39 ఏళ్ల వయసున్న వారిలో 10 నుంచి 12 శాతం మందిలో హైపర్ టెన్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే..వీరిలో చాలా మందికి తమ కండీషన్ గురించి తెలియనే తెలియదు. అందుకే అందులో నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ సమస్య ఇలాగే కంటిన్యూ అయితే గుండెకి సంబంధించిన అన్ని జబ్బులూ వచ్చే ప్రమాదముంటుంది. దీంతో పాటు కిడ్నీ సమస్యలూ వస్తాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు పోయే ముప్పు కూడా ఉందని చెబుతున్నారు డాక్టర్ .


కారణాలివే


సాధారణంగా 40 ఏళ్లు దాటిన తరవాత బీపీ, షుగర్ లాంటివి వస్తుంటాయి. కానీ..అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా ఇప్పుడు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. డైట్ ఫాలో అవకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం లాంటివి మరింత దెబ్బ తీస్తున్నాయి. వీటికి తోడు విపరీతంగా స్మోక్ చేయడం, మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడైపోతోంది. అయితే కొన్ని సార్లు హార్మోన్ డిసార్డర్ వల్ల కూడా హైపర్ టెన్షన్ వస్తుంటుంది. కానీ ఇది చాలా అరుదు. ఎక్కువ శాతం అలవాట్ల కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తుతుంది.


నిర్లక్ష్యం వల్ల ముప్పు


చాలా మంది యువతీ యువకులకు బీపీ చెక్ చేసుకునే అలవాటు ఉండడం లేదు. మాకేమవుతుంది. యంగ్ గానే ఉన్నాం కదా అనుకుంటారు. ఏవైనా సింప్టమ్స్ కనిపిస్తే తప్ప పెద్దగా పట్టించుకోరు. అయితే..ఇలా వదిలేయడం వల్ల డయాగ్నైజ్ చేయడం ఆలస్యం అవుతోంది. నిజానికి ఇది ఓ సైలెంట్ కండీషన్ అని వివరిస్తున్నారు డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి. ఈ జబ్బు ముదిరేంత వరకూ సింప్టమ్స్ కనిపించవు. విపరీతమైన తలనొప్పి, నీరసం,కంటి చూపు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ అప్పటికే గుండె, కిడ్నీలకు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. అందుకే రెగ్యులర్ గా బీపీ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బీపీ ఉంటే వాళ్లు తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాలి.


ఎలా తగ్గించుకోవాలి


ఓసారి హైపర్ టెన్షన్ వచ్చిందని తెలిస్తే వెంటనే అలెర్ట్ అవాలి. లైఫ్ స్టైల్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సులువుగానే ఈ కండీషన్ నుంచి బయటపడొచ్చు. ముందుగా డైట్ లో మార్పులు చేసుకోవాలి. సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. వారానికి కనీసం 150 నిముషాల పాటు వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. బరువు పెరిగే కొద్దీ గుండెకి ముప్పు పెరుగుతూ ఉంటుంది.


ఆల్కహాల్ తగ్గించాలి


ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. దీంతో పాటు టొబాకో కూడా తగ్గించాలి. ఈ రెండింటినీ ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది. ఇక ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగ చేయాలి. రెగ్యులర్ గా ప్రాణాయామం చేసుకోవడం మంచిది. దీంతో పాటు బిహేవియరల్ థెరపీ అవసరం పడుతుంది. అయితే..ఈ జాగ్రత్తలు పాటించకపోతే బ్లడ్ ప్రెజర్ కి మెడికేషన్ తప్ప ఇంకే ఆప్షన్ ఉండదు. ఈ మందుల కారణంగా మిగతా అవయవాలు కూడా దెబ్బ తినే ప్రమాదముంటుంది. అందుకే ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేసుకుంటూ అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa