ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుదైన మెదడు తినే అమీబా వ్యాధితో 9 ఏళ్ల బాలిక మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 07:43 PM

కేరళ అరుదైన విచిత్రమైన వ్యాధలకు నిలయంగా మారుతోంది. గతంలో నిపా వైరస్ వంటి వ్యాధులు ఇక్కడ కలకలం రేపగా.. ఇప్పుడు మెదడును తినే అమీబా అనే వింత వ్యాధి రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తోంది. తాజాగా కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక ఈ అరుదైన వ్యాధి కారణంగా మరణించడం స్థానికంగా విషాదం నింపింది. ఈ సంఘటన రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు, ప్రజలకు ఒక కొత్త సవాలును విసురుతోంది.


ఈ విషాదకర ఘటన కోజికోడ్ జిల్లాలోని తామరస్సేరి ప్రాంతంలో జరిగింది. ఈ నెల 13న తీవ్ర జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధ పడుతున్న ఓ బాలికను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె మరణించింది. బాలిక మరణానికి కారణం తెలుసుకునేందుకు చేసిన మైక్రోబయాలజికల్ పరీక్షలలో.. ఆమె మెదడువాపు వ్యాధితో బాధ పడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఇది మెదడును తినే అమీబా వల్ల వచ్చే అరుదైన వ్యాధి అని వైద్యులు తెలిపారు.


ఈ ఘటనతో అప్రమత్తమైన ఆరోగ్య అధికారులు.. వెంటనే అమీబా సంక్రమణకు మూలకారణాన్ని కనుగొనేందుకు చర్యలు చేపట్టారు. బాలిక నివాసానికి సమీపంలో ఉన్న నీటి వనరులు, సరస్సులు, చెరువులను పరిశీలించారు. ఈ అమీబా కలుషిత నీటిలో నివసిస్తుందని.. మురికి నీటితో స్నానం చేసినప్పుడు లేదా నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఈ వ్యాధిని ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ అని కూడా అంటారు. ఇది చాలా అరుదుగా సంక్రమించినప్పటికీ.. ఇది ప్రాణాంతకంగా మారుతుంది.


కోజికోడ్ జిల్లాలో ఇలాంటి కేసులు నాలుగు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. అయితే ఇది ఈ రకమైన ఐదవ కేసు అని స్పష్టం చేశారు. నీటి వనరులను పరిశీలించి, వాటిలో అమీబా ఉనికిని నిర్ధారించుకున్న తర్వాత, ఆ నీటిని ఎంతమంది ఉపయోగించారో తెలుసుకోవాల్సి ఉంది. దాని ఆధారంగా వ్యాధి వ్యాప్తిని అంచనా వేయవచ్చని అధికారులు చెప్పారు. ఈ వ్యాధికి కచ్చితమైన చికిత్స అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.


ఈ ఘటన ప్రజలలో భయాందోళనలను పెంచింది. ముఖ్యంగా వేసవి కాలంలో పిల్లలు చెరువులలో, కాలువలలో స్నానాలు చేస్తుంటారు. కాబట్టి వారు కలుషిత నీటితో దూరంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు నొక్కి చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa