భార్యాభర్తల బంధం, విడాకులు, పిల్లల సంరక్షణకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వివాహం చేసుకున్న తర్వాత ఒక భాగస్వామి మరొకరిపై ఆధారపడకుండా ఉండటం అనేది అసాధ్యమని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. "సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలంటే పెళ్లే చేసుకోకూడదు" అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఇద్దరు పిల్లలున్న ఒక జంట విడాకుల కోసం కోర్టుకు వచ్చారు. భార్య మాట్లాడుతూ.. తాను తన భర్తపై ఆధార పడకుండా ఉండాలని కోరుకుంటున్నానని కోర్టుకు తెలిపింది. దీనిపై జస్టిస్ నాగరత్న భావోద్వేగంతో స్పందించారు. "నేను పాతకాలపు మనిషిని కావొచ్చు. కానీ ఒక భార్య నేను నా భర్తపై ఆధార పడనని చెప్పడం అసాధ్యం" అని ఆమె వ్యాఖ్యానించారు. ఆర్థికంగా కాకపోయినా ఒకరిపై ఒకరు మానసికంగా, భావోద్వేగంగా ఆధారపడటమే వివాహ బంధంలోని అంతర్లీన లక్షణం అని ఆమె నొక్కి చెప్పారు.
పిల్లల కోసమైనా విడాకులు తీసుకోకండి..
ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరు కూడా విద్యావంతులు, స్థిరపడినవారు. భర్త సింగపూర్‌లో పని చేస్తుండగా.. భార్య హైదరాబాద్ నుంచి విచారణలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ముఖ్యంగా భార్త.. తన భర్తతో కలిసుండాలని లేదని చెప్పింది. గతంలో అతడితోపాటు సింగపూర్ వెళ్తే.. తమను సరిగ్గా చూసుకోలేదని వాపోయింది. డబ్బుల విషయంలో గొడవలు జరిగినట్లు వివరించింది. అందుకే తాను ఎవరిపై ఆధార పడకుండా జీవించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. కానీ న్యాయస్థానం మాత్రం.. విడాకులు తీసుకోకుండా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలని కోర్టు దంపతులకు సూచించింది. "పిల్లలు విచ్ఛిన్నమైన కుటుంబాన్ని చూడకూడదు" అని న్యాయమూర్తులు తీవ్ర భావోద్వేగంతో పేర్కొన్నారు.
విడాకుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి.. రాజీ పడేందుకు ప్రయత్నించాలని చెప్పారు. భార్య, పిల్లల నిర్వహణ ఖర్చుల కోసం భర్త రూ. 5 లక్షలు జమ చేయాలని.. అలాగే వారాంతాల్లో పిల్లలను తన వద్దకు తీసుకెళ్లాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో భర్త రాజీకి సిద్ధమని చెప్పగా.. భార్య మాత్రం విముఖత చూపినట్లు తెలుస్తోంది.ఈ మొత్తం వ్యవహారం వివాహ వ్యవస్థపై సుప్రీం కోర్టుకున్న సంప్రదాయ వైఖరిని మరోసారి బయటపెట్టింది. వివాహ బంధాన్ని కాపాడటం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే కోర్టు ప్రధాన లక్ష్యమని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa