ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులిపిర్లు తగ్గించే చిట్కాలు,,,,వాటంతట అవే రాలిపోతాయి

Life style |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 10:13 PM

ఈ రోజుల్లో పులిపిర్లు ఒక సాధారణ చర్మపు సమస్య. ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. పులిపిర్లు చిన్నవి. గరుకుగా, చర్మం రంగులో లేదా కొన్ని సార్లు ముదురు రంగులో ఉంటాయి. ఇవి శరీరంలోని ఏ భాగంలోనైనా కనిపిస్తాయి. కానీ సాధారణంగా చేతులు, కాళ్ళు, మెడ, ముఖంపై కనిపిస్తాయి.


పులిపిర్లు అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నొప్పి లేదా అసౌకర్యాన్ని కడా కలిగిస్తాయి. పులిపిర్లు పరిమాణం, రకం వ్యక్తి చర్మం, వైరస్ రకాన్ని బట్టి ఉంటుంది. పులిపిర్లను ఇంటి చిట్కాల నుంచి లేజర్ చికిత్స, క్రయోథెరపీ, శస్త్రచకిత్స వంటి వివిధ పద్దతుల ద్వారా తొలగించవచ్చు.


​పులిపిర్లను తొలగించడానికి ఇంట్లో కొన్ని చిట్కాలు ప్రభావవంతంగా ఉంటాయని డాక్టర్ సలీం జైదీ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పారు. అసలు పులిపిర్లు అంటే ఏంటి? అవి ఎలా వస్తాయి, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


పులిపిర్లు అంటే ఏంటి?


పులిపిర్లు అనేది హ్యూమన్ పాపిల్లోమావైరస్  వల్ల కలిగే ఒక రకమైన చర్మ సంక్రమణ. ఈ ఇన్ఫెక్షన్ గరుకుగా, చర్మం రంగులో ఉండే గడ్డలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ పులిపిర్లు అంటువ్యాధి కావచ్చు. సోకిన వ్యక్తిని తాకడం ద్వారా కూడా సంక్రమించవచ్చు. ఇతరుల టవల్స్, నాప్‌కిన్స్, మేకప్ బ్రష్‌ల్ని వాడటం ద్వారా కూడా పులిపిర్లు రావచ్చని డాక్టర్ చెబుతున్నారు.


సాలిసిలిక్ యాసిడ్


సాలిసిలిక్ ఆమ్లం అనేది ఒక రకమైన రసాయన నిర్మాణం. ఇది ప్రధానంగా చర్మం నుంచి అదనపు జిడ్డును తొలగించడంలో సాయపడుతుంది. సాలిసిలిక్ యాసిడ్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీంతో, ఇది హానికరమైన బ్యాక్టీరియాను సులభంగా తొలగించగలవు. ఇది సెబమ్ ఉత్పత్తిని కూడా గణనీయంగా తగ్గిస్తుంది.


దీంతో, పులిపిర్లు తగ్గించుకోవడానికి సాలిసిలిక్ యాసిడ్ ఉపయోగించవచ్చు. దీని కోసం కాస్తా దూది తీసుకుని సాలిసిలిక్ యాసిడ్‌లో ముంచి పులిపిర్లపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల అవి కొద్ది రోజుల్లో వాటంతట అవే తొలగిపోతాయని డాక్టర్ చెబుతున్నారు. వీటితో పాటు కొన్ని సహజ చిట్కాలపై ఓ లుక్కేద్దాం.


యాపిల్ సైడర్ వెనిగర్


అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం యాపిల్ సైడర్ వెనిగర్ పులిపిర్లు తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీనిలో ఆమ్ల లక్షణాలు ఉన్నాయి. ఇది పులిపిరిపై నెమ్మదిగా పని చేసి.. అది కుంచించుకుపోయేలా చేస్తుంది.


ఇందుకోసం రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ నీటిని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోండి. ఈ మిశ్రమంలో ఒక దూదిని ముంచి పులిపిర్లపై అప్లై చేసి.. ఆ తర్వాత దానిని ఓ గుడ్డతో కట్టులా కట్టుకోండి. రాత్రిపూట కట్టును అలాగే ఉంచి.. ఉదయం దాన్ని తొలగించండి. పులిపిర్లు రాలిపోయే వరకు ఈ చిట్కాను రిపీట్ చేయండి.


వెల్లుల్లి


ఔషధ గుణాలు అధికంగా ఉండే వెల్లుల్లి, పులిపిర్లను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి పేస్ట్‌ను ప్రతిరోజూ పులిపిర్లకు పూయండి. దానిని కట్టుతో కప్పండి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పులిపిర్లు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.


కలబంద


ఆయుర్వేదంలో కలబందకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక, కలబంద జెల్ శీతలీకరణ ప్రభావాన్ని, యాంటీ మైక్రోబయల్ లక్షణాల్ని కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల పులిపిర్లు తొలగిపోతాయి. పులిపిర్లు మంట పుడితే.. కలబంద జెల్‌ను పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పులిపిర్లు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.


డక్ట్ టేప్


డక్ట్ టేప్ అనేది పులిపిర్లు తొలగించడానికి పురాతనమైన పద్ధతి. పులిపిర్లు తొలగించడానికి డక్ట్ టేప్‌ను దానికి అంటిస్తారు. కొన్ని రోజుల తర్వాత, టేప్ తొలగించి పులిపిర్లు యొక్క పై పొరను సున్నితంగా స్క్రబ్ చేస్తారు. ఈ పద్ధతి సమయం తీసుకుంటుంది. కానీ పులిపిర్లు తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.


గుర్తించుకోవాల్సిన విషయాలు


ఈ ఇంటి నివారణల ప్రభావం వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. కొన్ని సందర్భాల్లో పులిపిర్లు క్రమంగా వాటంతట అవే మాయమవుతాయి. ఏ చికిత్స ఉపయోగించినా, దానిని చాలా వారాల పాటు కొనసాగించాలి. పులిపిర్లు పెరుగుతూ బాధాకరంగా లేదా ప్రైవేట్ భాగాలు లేదా ఇతర సున్నితమైన ప్రాంతాలలో ఉంటే సొంత చికిత్స వద్దు.


చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. వైద్యుడు క్రయోథెరపీ, లేజర్ చికిత్స, రసాయన పీల్స్, ఇమ్యునోథెరపీ లేదా శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగిస్తారు. ఇక, పై వస్తువులు వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ముఖ్యం. ఏదైనా రియాక్షన్ ఉంటే ఆ రెమిడీని ఉపయోగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa