ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేమాతరం ఎప్పుడు పాడాలి? ఎలా గౌరవించాలి?

national |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 08:41 PM

భారత జాతీయ గేయం 'వందేమాతరం' విషయంలో కేంద్ర హోం శాఖ చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వందేమాతరం గేయాన్ని ఆలపించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో జాతీయ గీతం 'జనగణమన' ముగిసిన వెంటనే 'వందేమాతరం' ప్లే చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అయితే ఈ గేయం ఆలపిస్తున్నప్పుడు దానికి గౌరవసూచకంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఆరు చరణాలూ పాడాల్సిందే!


ముఖ్యంగా ఈ గేయంలోని మొత్తం ఆరు చరణాలను కచ్చితంగా ఆలపించాలని కేంద్రం నిర్ణయించింది. 1937లో కాంగ్రెస్ పార్టీ ఈ గేయంలోని చివరి నాలుగు చరణాలను తొలగించింది. అయితే ఇప్పుడు ఆ నాలుగు చరణాలను కూడా తిరిగి చేర్చి, పూర్తి గేయాన్ని పాడాలని కేంద్రం ఆదేశించింది. దీనివల్ల రాజకీయంగా పెను దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది ఇదే అంశంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిన నేపథ్యంలో.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.


 కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల వేడుకల్లో కూడా వందేమాతరం ప్లే చేస్తారు. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆయన రాక సమయంలో, అలాగే తిరిగి వెళ్లే సమయంలో ఈ గేయం వినిపిస్తుంది. అయితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా సినిమా థియేటర్లలో మాత్రం వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అక్కడ ప్లే చేసినా నిలబడటం తప్పనిసరి కాదని కేంద్రం వెల్లడించింది.


వందేమాతరం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే తన గళాన్ని వినిపించారు. దేశ విభజన సమయంలో ముహమ్మద్ అలీ జిన్నా అభ్యంతరాల మేరకు.. ముస్లింలు అసంతృప్తికి లోనవుతారనే కారణంతో నెహ్రూ ఈ పాటను వ్యతిరేకించారని ప్రధాని మోదీ గతంలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే గేయంలోని చరణాలను తొలగించిందని బీజేపీ వాదిస్తోంది. ఇప్పుడు ఆ చరణాలను మళ్లీ గేయంలో చేర్చడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. ఇది మతపరమైన విభజన కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa