హ్యుందాయ్ కార్ల ధరల పెంపు

షేర్ చేయండి:

కారు కొనాలని చూస్తున్న వారికి హ్యుందాయ్‌ నుంచి షాక్‌ తగలనుంది. సెప్టెంబర్‌ 2026 నుంచి దేశవ్యాప్తంగా కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రకటించింది. అన్ని మోడళ్లు, వేరియంట్లపై గరిష్ఠంగా 1 శాతం వరకు ధరలు పెరగనున్నాయి.

ధరల పెంపు అన్ని కార్లకు ఒకేలా ఉండదు. మోడల్‌, వేరియంట్‌ను బట్టి పెంపులో మార్పు ఉంటుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంత మేర వినియోగదారులపైకి బదిలీ చేయాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ముడిసరకులు, కమోడిటీ ధరలు పెరగడం హ్యుందాయ్‌పై ఒత్తిడి పెంచింది. నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో వ్యయాలను తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నించినా.. ధరల పెంపు తప్పలేదని పేర్కొంది.

హ్యుందాయ్‌ ఆర్థిక ఫలితాలపై కూడా ఈ ఒత్తిడి కనిపించింది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.888.6 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,369.2 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం 0.5 శాతం తగ్గి రూ.16,334.6 కోట్లకు చేరింది. ఎబిటా 31 శాతం క్షీణించి రూ.1,511 కోట్లకు పరిమితమైంది. ఎబిటా మార్జిన్‌ 13.3 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గింది.

మారుతీ సుజుకీ కూడా ఆగస్టు నుంచి తన అరేనా, నెక్సా కార్ల ధరలను పెంచింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.30,000 వరకు పెంపును అమలు చేసింది. ఈ ఏడాదిలో మారుతీకి ఇది రెండో ధరల పెంపు.