ప్రిన్సిపల్ ను 27 సార్లు పొడిచారు

షేర్ చేయండి:

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. విలాసాలకు అలవాటు పడిన ఇద్దరు మైనర్ విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో ఒకరు ఆమెను ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ వెల్లడించారు.

బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేసేందుకు ఇద్దరు విద్యార్థులు పథకం రచించారు. అందులో ఒకరు మాస్క్ ధరించి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే, ప్రమాదవశాత్తు మాస్క్ జారిపోవడంతో రూపారెడ్డి అతడిని గుర్తుపట్టారు. దీంతో భయాందోళనకు గురైన నిందితుడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. 27 సార్లు పొడిచి చంపిన అనంతరం, ఆమె ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సుమారు 70 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత గైర్హాజరైన వారిలో ఇద్దరు విద్యార్థులు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

గతంలో హాస్టల్‌లో ఉన్న సమయంలో నిందితుడి వద్ద నగదు, సెల్‌ఫోన్ దొరకడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి అతడిని మందలించారు. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు, ప్రధానంగా డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రూ. 1.54 లక్షల నగదు, ఒక ఐఫోన్‌‍ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోట్లపై ఉన్న రక్తపు మరకలను ల్యాబ్‌లో పరీక్షించగా, అవి మనిషి రక్తమేనని నిర్ధారణ అయింది. నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరుస్తామని ఎస్పీ వివరించారు.