పార్టీలో క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికే రాబోయే ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.
పరకాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా సుస్మిత మాట్లాడుతూ, ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే టికెట్ ఎలా ప్రకటిస్తారంటూ సీఎం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ముల భాగోతాలు, స్కాములను బయటపెడతానని హెచ్చరించడం ప్రకంపనలు సృష్టించింది.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న సుస్మిత వ్యాఖ్యలపై పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో లక్ష్మణరేఖను దాటి ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు ఈ అంతర్గత వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ స్పందిస్తూ, పూర్తి నివేదిక ఇవ్వాలని పీసీసీ నాయకత్వాన్ని ఆదేశించారు. మరోవైపు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ, పార్టీ అధిష్ఠానం నిర్ణయమే అందరికీ శిరోధార్యమని, అనవసర వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వబోనని తెలిపారు.
