అస్వస్థతతో షావుకారు జానకి ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా, బుధవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
94 ఏళ్ల షావుకారు జానకి గత కొంతకాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, నిన్న రాత్రి నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
1931 డిసెంబర్ 12న జన్మించిన జానకి, 1950లో విడుదలైన 'షావుకారు' చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. ఎన్.టి.రామారావు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రాల్లో ఒకటైన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో, ఆమె పేరు ముందు 'షావుకారు' స్థిరపడిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను 2022లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.
