భారత విద్యార్థినికి రూ. 1.3 లక్షల జరిమానా!
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ భారతీయ విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. కేవలం ఐదు నిమిషాల పాటు వేడినీటి స్నానం చేసినందుకు 1,800 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 1.3 లక్షలు) జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ వింత అనుభవాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వమిక అనే భారతీయ యువతి సిడ్నీలో నివసిస్తోంది. ఇటీవల ఆమె తన అపార్ట్‌మెంట్‌లో వేడినీటితో స్నానం చేసింది. అయితే, చలిగా ఉంటుందన్న కారణంతో బాత్రూమ్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్ చేయలేదు. దీంతో స్నానం తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చిన వేడినీటి ఆవిరి, సమీపంలో ఉన్న ఫైర్ అలారంకు తగిలింది. వెంటనే భవనంలో ఫైర్ అలారం పెద్ద శబ్దంతో మోగింది.
అలారం మోగడంతో మొదట ఏదైనా డ్రిల్ అనుకున్నానని, కానీ కాసేపటికే బిల్డింగ్ మేనేజర్ తన అపార్ట్‌మెంట్‌లోకి వచ్చారని వమిక తన వీడియోలో చెప్పింది. ఫాల్స్ అలారం కారణంగా ఫైర్ సిబ్బంది రావడంతో, అధికారులు ఆమెకు పన్నులతో కలిపి సుమారు 1,900 డాలర్ల బిల్లు వేశారు. "వంట చేస్తుండగా ఇలా జరిగి ఉంటే ఇంత ఇబ్బందిగా ఉండేది కాదేమో" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. వాష్‌రూమ్‌కు ఇంత దగ్గరగా ఫైర్ అలారం ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించింది.
వమిక పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియాలోని అనేక అపార్ట్‌మెంట్లలో, ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ లాంటి ప్రాంతాల్లో, ఆవిరి లేదా వంట పొగ వల్ల ఫాల్స్ అలారమ్స్ మోగితే ఫైర్ బ్రిగేడ్ ఖర్చులను నివాసితుల నుంచే వసూలు చేస్తారు. ఈ నిబంధనల వల్లే ఆమెకు అంత పెద్ద మొత్తంలో జరిమానా పడినట్లు తెలుస్తోంది.
