బాస్ ప్రొఫైల్ ఫొటోతో రూ. కోటి మోసం
హైదరాబాద్: వాట్సాప్‌లో మీ కంపెనీ యజమాని లేదా పైఅధికారి ప్రొఫైల్ ఫొటో కనిపిస్తూ 'అర్జెంట్‌గా డబ్బులు పంపండి' అని సందేశం వస్తే వెంటనే నమ్మకండి. ప్రొఫైల్ పిక్చర్, పేరు ఒకేలా ఉన్నంత మాత్రాన అది మీ బాస్ నంబరే అని భావిస్తే సైబర్ క్రిమినల్స్ వలలో పడే ప్రమాదం ఉంది. సరిగ్గా ఇలాంటి వాట్సాప్ మెసేజ్‌నే నమ్మి ఒక అకౌంటెంట్ రూ. కోటి పోగొట్టుకోగా, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేవలం 10 రోజుల్లోనే ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టారు.
ఈ కేసు వివరాలను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్, లక్నోకు చెందిన దీపక్కుమార్ అనే వ్యక్తి వాటర్ ప్లాంట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో సైబర్ నేరాల వైపు మళ్లాడు. ఆన్‌లైన్ లావాదేవీలు ఎక్కువగా జరిపే పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా సైబరాబాద్ పరిధిలోని ఒక చీరల వ్యాపార సంస్థను ఎంచుకున్నాడు. సోషల్ మీడియా, లోకల్ నెట్‌వర్క్ ద్వారా సదరు వ్యాపారి వివరాలు, అక్కడ పని చేసే అకౌంటెంట్ సమాచారాన్ని సేకరించాడు. యజమాని ప్రొఫైల్ ఫొటో, పేరును ఉపయోగించి వేరే నంబర్‌తో ఒక నకిలీ వాట్సాప్ ఖాతాను తెరిచాడు.
ఈ నెల 4వ తేదీన 'నేను ఒక అత్యవసర పనిలో ఉన్నాను, వెంటనే ఈ ఖాతాకు డబ్బులు పంపు' అని అకౌంటెంట్‌కు మెసేజ్ పంపాడు. మెసేజ్ పంపింది యజమానే అని భావించిన అకౌంటెంట్ ఆలోచించకుండా కంపెనీ కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాతా నుండి నిందితుడి ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతాకు రూ. కోటి బదిలీ చేశాడు. ఆ తర్వాత అసలు యజమానితో మాట్లాడటంతో మోసపోయినట్లు గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు.
డీసీపీ కె. పుష్ప, ఏసీపీ రవీందర్ రెడ్డిల పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మన్మోహన్ బృందం సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించింది. బాధితుడి రూ. కోటి 'రాయల్ మోడా ప్రైవేట్ లిమిటెడ్' పేరిట ఉన్న కార్పొరేట్ అకౌంట్‌లోకి వెళ్లినట్లు గుర్తించి, తక్షణమే బ్యాంక్ అధికారులను సమన్వయం చేసుకుని ఆ ఖాతాను ఫ్రీజ్ చేశారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ నెల 8న లక్నో వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం స్పందించి ఆదేశాలు ఇవ్వడంతో, ఫ్రీజ్ చేసిన రూ. 1 కోటి మొత్తాన్ని బాధితుడికి పూర్తిస్థాయిలో రీఫండ్ చేశారు. ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా పోయిన సొమ్ము మొత్తం బాధితుడికి తిరిగి దక్కడం విశేషం.
