ఒకే కుటుంబంలోని నలుగురి మృతి
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయవిదారక ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామానికి చెందిన రాజు, తన భార్య భాగ్య, కుమారుడు నియాన్ష్, కుమార్తె శాన్వికతో కలిసి సిద్దిపేటలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం రాత్రి కారులో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే, ఎంతసేపటికీ వారు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు రాజు మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అప్పనపల్లి గ్రామ శివారులో సిగ్నల్ నిలిచిపోవడంతో అక్కడ పరిశీలించగా, రోడ్డు పక్కన ఉన్న బావిలో కారు పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి కారును, మృతదేహాలను వెలికితీశారు.
ఈ ప్రమాదంలో రాజు, భాగ్య, నియాన్ష్, శాన్విక అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
