టికెట్ల పెంపునకు తెలంగాణ అనుమతి
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల నియంత్రణ, ప్రదర్శనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. భారీ బడ్జెట్ చిత్రాల విడుదలైన తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, ఇందుకోసం ఒక కీలక నిబంధనను విధించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం వెలుగులోకి వచ్చాయి.
తాజా ఆదేశాల ప్రకారం.. రూ.100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన చిత్రాలను 'సూపర్ హై-బడ్జెట్' సినిమాలుగా పరిగణిస్తారు. అటువంటి చిత్రాల నిర్మాతలు టికెట్ ధరలను పెంచుకోవాలంటే, ముందుగా తెలుగు సినిమా పరిశ్రమ సంక్షేమ కమిటీ ఖాతాలో రూ. కోటి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిధిని సినీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. కార్మిక శాఖ, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్ల యూనియన్ ప్రతినిధులతో కూడిన కమిటీ ఈ నిధిని పర్యవేక్షిస్తుంది.
చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది. అయితే, పండుగ రోజులు సహా సాధారణ రోజుల్లోనూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షోను తప్పనిసరిగా చిన్న చిత్రాల ప్రదర్శనకే కేటాయించాలనే నిబంధన విధించింది.
కొత్త నిబంధనల ప్రకారం.. టికెట్ ధరలపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, ఎయిర్-కూల్డ్ థియేటర్లు రూ. 3 అదనంగా వసూలు చేసేందుకు అనుమతినిచ్చారు. అలాగే ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీలో ఉంచడం తప్పనిసరి. మల్టీప్లెక్స్‌లకు సమానంగా వసతులున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను 'స్పెషల్ థియేటర్' కేటగిరీగా గుర్తించనున్నారు. జిల్లా కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీలు ఈ హోదాను ఖరారు చేస్తాయి. సినిమా రంగంలోని వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు, భారీ చిత్రాలకు ధరల పెంపుతో పాటు చిన్న సినిమాల ప్రదర్శనపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
