నామినేటెడ్ పదవుల్లో పాత నేతలకు 80%, కొత్త వారికి 20%

Select Suryaa Now

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పదవుల కేటాయింపుపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడి పనిచేసిన పాత కార్యకర్తలకు 80 శాతం, కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులకు 20 శాతం నామినేటెడ్ పదవులు కేటాయించనున్నట్లు తెలిపారు. వచ్చే సెప్టెంబర్‌లోనే ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించిన నిబద్ధత కలిగిన కార్యకర్తల త్యాగాలు, కృషి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అందుకే ఈసారి పదవుల కేటాయింపులో క్రమశిక్షణ, నిబద్ధత, కష్టపడే తత్వానికే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

అదే సమయంలో, పార్టీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే 20 శాతం పదవులను నూతన నేతలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తవుతుందనే ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.