సనత్‌నగర్ ‘టిమ్స్’లో ఇన్‌పేషెంట్ సేవలు
హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఇటీవల ప్రారంభమైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ఆగస్టు 21, శుక్రవారం నుంచి ఇన్‌పేషెంట్ (ఐపీ) సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈ ఆసుపత్రిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం సందర్భంగా సందర్శకులు ఆపరేషన్ థియేటర్లు, వార్డులను పెద్ద సంఖ్యలో సందర్శించడంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ముప్పు ఏర్పడింది. దీనిని నివారించేందుకు యాజమాన్యం ఫ్యూమిగేషన్ ప్రక్రియ చేపట్టింది. గురువారంతో మొదటి దశ ముగియనుండటంతో శుక్రవారం నుంచి ఐపీ సేవలను మొదలుపెట్టనున్నారు.
మరికొన్ని దశల్లో ఫ్యూమిగేషన్ పూర్తిచేసి, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శస్త్రచికిత్సలు కూడా ప్రారంభిస్తారు. ఇందుకు మరో రెండు, మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, టిమ్స్‌లో ఔట్ పేషంట్ (ఓపీ) సేవలకు రోగుల నుంచి భారీ స్పందన వస్తోంది. ట్రయల్ రన్ సమయంలో రోజుకు 200 మంది రాగా, బుధవారం ఈ సంఖ్య 700 దాటింది. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తూ.. మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యులు సేవలు అందిస్తున్నారు.
