పేదల సంక్షేమ కార్యక్రమాలపై వ్యతిరేక ధోరణి సరైనది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల కోసం విశాఖ వచ్చిన ఆయన గురువారం అల్లిపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదల సంక్షేమ కార్యక్రమాలపై ఇటీవల కొంత కాలం నుంచి వ్యతిరేక ప్రచారం జరుగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో కార్పొరేట్ సంస్థలకు 10 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేశారని విమర్శించారు. పేదలకు ఉచితాలు ఇస్తే ఉలిక్కిపడుతున్నారని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నుంచి రాష్ట్రం అప్పుల పాలయిందని, రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నాటికి జనాభా ప్రాతిపదికన రాష్ట్రం అప్పు 96 వేల కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం 8. 40 లక్షల కోట్లకు చేరిందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసే నాటికి అప్పు 10 లక్షలకు చేరుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ప్రాథమిక విద్య బోధన మాతృభాషలోనే జరగాలని యు జి సి చైర్మన్ సైతం చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలను మూలన పడేసిందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా బీహార్ తరహాలో లౌకిక శక్తులను ఒకే వేదిక పైకి తీసుకురావడంపై రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, జనసేన రాష్ట్రంలో కొట్లాడుకుంటూ కేంద్రంలో మాత్రం అందరూ మోడీ పంచన చేరుతున్నారని ఎద్దేవా చేశారు.
పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖలో శుక్రవారం బీచ్ లో వ్యర్ధాలు తొలగింపు, ప్లాస్టిక్ నిషేధంపై జిల్లా యంత్రాంగం భారీ కార్యక్రమం చేపట్టిందని అయితే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం ఎప్పటినుంచో జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారని, ఇంకో పార్టీ జెండా కనిపించడానికి వీల్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ఒక కార్పొరేట్ కంపెనీ తప్ప రాజకీయ పార్టీ కాదని, వీరికి ప్రజా ప్రయోజనాలు పట్టవని కార్పొరేట్ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని విమర్శించారు. కోర్టు కేసు నుంచి తప్పించుకునేందుకే జగన్ కి సీఎం పీఠం అవసరమని ఇతర సమస్యలు ఆయనకు అక్కర్లేదని అన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు పాల్గొన్నారు.