విజయనగరం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. కొత్తవలస మండలం గులివిందాడలో ఆవుల మందపై దాడి చేసింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పెద్ద పులి ప్రవేశించి ఆరు నెలలు కావస్తోంది. ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో సగం మండలాలను చుట్టేస్తోంది. వందలాది కిలోమీటర్లు సంచరిస్తోంది. రోజూ ఎక్కడో ఒక దగ్గర పులి కదలికల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకేరోజు వేర్వేరు మండలాల్లో కనిపిస్తున్న సందర్భాలున్నాయి. ఒకే పులి ఇన్ని కిలోమీటర్ల మేర సంచరించడం సాధ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకటి కంటే ఎక్కువే జిల్లాలో ఉన్నట్లు అనుమానాలున్నాయి.
వాస్తవానికి ఆరు నెలలుగా సంచరిస్తున్న పులి ఆనవాళ్లు ఎక్కడా లభ్యం కాలేదు. కానీ తొలిసారిగా ఆగస్టు 22న మెరకముడిదాం మండలం పులిగుమ్మిలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు పులి చిక్కింది. అటు తరువాత అటవీ శాఖ అధికారులు పట్టుబిగించారు. పులి సంచరించే అనుమానిత ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటుచేశారు. కానీ ఎక్కడా చిక్కలేదు. ఇప్పుడు రూటు మార్చిన పులి రాజాం, వంగర ప్రాంతాల వైపు వచ్చింది. అయితే ఇంతుకు ముందు సేకరించిన పాద ముద్రికలతో. ఇక్కడ లభించినవి భిన్నంగా ఉన్నాయి. చిరుతపులి పోలినవిగా ఉన్నాయి. దీంతో ఒకటి కంటే ఎక్కువ పులులు సంచరిస్తున్నట్టు ప్రాథమికంగా అటవీ శాఖ అధికారులు నిర్థారణకు వచ్చారు.