విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అంతరాలయం దర్శనం విషయంలో ఆలయ అధికారుల తీరుపై ఉభయదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ. 3000 పెట్టి టిక్కెట్ కొంటే అంతరాలయ దర్శనం ఇవ్వడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఈవో భ్రమరాంబను ఉభయదాతలు నిలదీశారు. అయితే వారికి నచ్చజెప్పాల్సిన ఈవో‘ఉభయదాతలు దండం పెడుతూ నేను అంతరాలయ దర్శనం ఇవ్వను ఏమి చేసుకుంటారో చేసుకోండి. నాతో గొడవ పడితే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను’’ అంటూ హెచ్చరించారు. మీడియా జరిగిన దాన్ని వీడియో తీస్తుండగా ‘‘మీకు వీడియోలు తీయడం సరదానా’’ అంటూ ఈవో దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోలీసులు, వారి కుటుంబలకు అంతరాలయ దర్శనానికి అనుమతివ్వడంతో ఉభయదాతలు ఈవోతో గొడవకు దిగారు. వారిని పంపి రూ. 3000 టికెట్ కొన్న మమ్మల్ని ఎందుకు పంపారు అని ఈవోతో వాగ్వాదానికి దిగారు. ప్రతి ఏడాది ఉభయ దాతలకు అంతరాలయ దర్శనం, గోత్రనామాలను చదివి, పాదుకలు ఇచ్చి పెట్టి, ఆశీర్వచనం అందించడం జరుగుతుంది. అయితే ఉభయదాతల విషయంలో ఈవో తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.