‘‘సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సీఐడీ అధిపతిలా కాకుండా సీఎం జగన్‌రెడ్డికి సెక్యూరిటీ గార్డులా వ్యవహరిస్తున్నారు’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. పులివెందులలో హత్యాచార బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మీడియాతో మాట్లాడి, ర్యాలీగా వెళ్లి పోలీసులకు వినతిపత్రం ఇచ్చిన ఘటనలో అనితతో పాటు మరో 20 మందిపై గతంలో కేసు నమోదయింది. ఆ కేసు విచారణకు ఆమె సోమవారం కడప కోర్టుకు హాజరయ్యారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఐడీ అధిపతి సునీల్ కుమార్ ఈ మధ్య పదే పదే ‘నేను అంబేడ్కరిజాన్ని నరనరానా జీర్ణించుకున్నా. నేను అంబేడ్కర్ వాదిని’ అని చెపుతున్నాడు. నిజంగా అంబేడ్కరిజాన్ని పుణికి పుచ్చుకునుంటే ఎందుకు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నావు? కనీసం మాకు సమాధానం చెప్పకపోయినా నీకు నీవే ఒకసారి ప్రశ్నించుకో’’ అని అనిత సూచించారు.