తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ని బుధవారం అర్థరాత్రి గోడలు దూకించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కావలి తెలుగుదేశం పార్టీ మహిళా నేత గుంటుపల్లి శ్రీదేవి చౌదరి తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రభివృద్ధిని మరచి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడమే ఈ వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతుందని, ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని అన్నారు.
ఇంటి నిర్మాణాల కూల్చి వేత మొదలు అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. వైసిపి సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని ఆమె మండిపడ్డారు.
ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షానికి పోలీసులు చుట్టాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. అక్రమ కేసులను పెట్టడం, బెదిరించడం, దాడులు చేయడం వంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నామన్నారు.
అర్ధరాత్రి సమయంలో గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టుకొని ఇంటి లోపలకి వచ్చి ఇంటిలో వారిని భయబ్రాంతులకు గురి చేస్తే వారు దొంగలో, పోలీసులో ఎలా తెలుస్తుందన్నారు. అయ్యన్నపాత్రుడికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.