ఆశయం గొప్పదైతే సరిపోదనీ అది ఆచరణలో కూడా ఉండాలని వైసీపీ సర్కార్ కు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు రూ.40 వేల కోట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వం లూటీ చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ మూడేళ్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) విధానం ద్వారా రూ.1.20 నుంచి 1.30 లక్షల కోట్లుప్రజలకు అందజేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఈ మూడున్నరేళ్లలో రూ.1.35 లక్షల కోట్లు మద్యం ద్వారా అర్జించిందన్నారు. మధ్య నిషేధం పేరిట ప్రజలను నమ్మించి మద్యం రూపంలోనే లక్షల కోట్ల రూపాయలను ఈ మూడున్నరేళ్ల వ్యవధిలో లాగేసుకోవడం న్యాయమా అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం కాదు.. నియంత్రణ చేస్తామన్నారన్నారని.. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మధ్యాభిషేకం జరుగుతుందన్నారు. ఆశయం గొప్పదైతే సరిపోదనీ అది ఆచరణలో కూడా ఉండాలన్నారు. రాష్ట్రంలో తాగుబోతుల ఆగడాలు తీవ్రంగా ఉన్నాయన్న ఆయన.. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మందు బాబులు ఆగడాల వీడియోను ప్రదర్శించారు.
దీనిపై ముఖ్యమంత్రిజ జగన్‌ను ప్రశ్నిస్తే.. అక్క చెల్లెమ్మలకు ఎంతో చేయాలని ఉందని.. తనకు దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఐపీసీ 153A సెక్షన్ కింద కేసులు నమోదు చేసి.. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. రెండు జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారన్న నెపంతో కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించే ప్రశ్నిస్తున్నామన్న ఆయన.. రాష్ట్రంలో 175 స్థానాలను గెలుచుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి.. అంత బలహీన ప్రభుత్వమా అంటూ ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని చెబుతున్నారని.. తనపైకేసులు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి డీబీటీ ద్వారా ప్రజలకు అందజేస్తున్నా.. తాము చెప్పే నాలుగు మంచి మాటలకే ఈ ప్రభుత్వం కూలిపోతుందా అన్నారు. విశాఖపట్నంపై ఎంతో ప్రేమ ఉందని చెబుతూనే కలెక్టరేట్, తాలూకా ఆఫీసులను తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణ రాజు కోరారు. ఎయిడెడ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన జగన్ ప్రభుత్వం.. ప్రస్తుతం ఎయిడెడ్ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. పదవీ విరమణను చేయడానికి సిద్ధంగా ఉన్న ఎయిడెడ్ ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్.. పనిచేసిన కాలానికి జీతభత్యాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కొంత మంది రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు పెద్దలు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని రఘురామ అన్నారు. ఈ విషయాన్ని హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. తన ఫోన్ ను ట్యాప్ చేసి ఎవరు వింటున్నారు.. ఎవరి ఆఫీసులో కూర్చుని వింటున్నారన్నది తనకు తెలుసునని.. ఆ మాత్రం ఇంటలిజెన్స్ నివేదిక తనకు కూడా ఉందన్నారు.
తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారిని నిర్దోషిగా ప్రకటించిందన్న రఘురామకృష్ణ.. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ కూడా కడిగిన ముత్యంలా.. స్వాతి ముత్యంలా నిర్దోషిగా బయట పడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరు తెలంగాణ హైకోర్టు నుంచి నిర్దోషులుగా క్లీన్ చీట్ పొందుతున్నారని.. అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా ఇతర కోర్టులను ఆశ్రయించే అవసరం లేకుండా నిర్దోషిగా బయటపడతారేమోనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa