పంజాబ్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.రైలు పట్టాలపై సరదాగా ఆడుకుంటూ, పండ్లు తింటుండగా.. వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం కిరత్‌పుట్ సాహిబ్‌లో సుల్తేజ్ నదిపై నిర్మించిన లోహంద్ రైల్వే బ్రిడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటన గురించి అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ జగ్‌జీత్ సింగ్ మాట్లాడుతూ.. నలుగురు పిల్లలు చెట్ల నుంచి పండ్లు కోసుకొని, రైలు పట్టాలపై కూర్చొని తింటున్నారని, అదే సమయంలో రైలు రావడంతో వాళ్లు మృతి చెందారన్నారు. తమవైపు రైలు రావడాన్ని ఆ పిల్లలు గమనించలేదన్నారు. అందుకే ఈ ప్రమాదం సంభవించిందన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు స్పాట్‌లోనే చనిపోయారని, మరొక బాలుడు ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు మార్గంలోనే శ్వాస విడిచారని జగ్‌జీత్ తెలిపారు. నాలుగో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. సహరన్‌పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్తున్న రైలు.. కిరత్‌పుత్ సాహిబ్‌కి చేరుకున్నప్పుడు ఈ ఘటన సంభవించిందని అన్నారు. ఈ యాక్సిడెంట్ తర్వాత రైలు నిలిచిపోయిందని, గాయపడిన వారిని ఆనంద్‌పర్ సాహిబ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే.. ఒక బాలుడు మార్గమధ్యంలోనే చనిపోయాడని వెల్లడించారు. ఇదిలావుండగా.. ఆడుకోవడానికి వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో, వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.