దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ అది తుఫాన్ గా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి-దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని ఐఎండీ తెలిపింది.
ఈ తుఫాన్ ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు, గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తుఫాన్ కు యూఏఈ సూచించిన 'మాండూస్' అనే పేరు పెట్టనున్నారు.