ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తూ జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్‌లోని స్పందన హాలులో కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 2022 సెప్టెంబర్ 30 నాటికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ. 10, 682. 77 కోట్లకు గాను రూ. 7, 516. 50 కోట్ల రుణాలు మంజూరు చేసి 70. 36 శాతం ఆర్థిక ప్రగతి సాధించామని అధికారులు చెప్పారు.
పంట రుణాలకు సంబంధించి రూ. 4, 541. 84 కోట్ల లక్ష్యానికి గాను రూ. 2, 884. 43 కోట్ల రుణాలను అందజేసి 63. 51 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రుణాలు అందించడంలో జిల్లా పురోగమనంలో కొనసాగుతున్నందుకు బ్యాంకర్లను అభినందిస్తున్నామన్నారు.
బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక రకాలయిన సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందుకు సంబంధించి అన్ని రకాల బ్యాంకు శాఖలు ఆయా పట్టణ, గ్రామీణ పరిధిలో రుణ పథకాలకు అర్హత పొందిన లబ్దిదారులకు వెంటనే రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని సచివాలయాలు, ఆర్‌బికె పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సేవలను అందించాలన్నారు.